నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను... చేతల్లో చూపిస్తా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మీరు సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటామంటూ వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని తెలిపారు. కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని.. వివిధ కులాలు కొట్టుకోవాలనేదే జగన్ నైజం అని ఆరోపించారు. కలిపేవారినే ప్రజలు గుర్తుంచుకుంటారు కానీ, విడదీసే వారిని కాదని అన్నారు పవన్ కళ్యాణ్. సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది... జగన్ విష సంస్కృతి తిరిగి ఆయన ఇంటికే వచ్చిందని పవన్ అన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కూడా గొప్పేనా? అని ప్రశ్నించారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించాల్సి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని, సంక్షేమ పథకాలు భవిష్యత్ లోనూ కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వచ్చేది జనసేన-టీడీపీ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇక భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దు అయింది. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాల వారీ మీటింగ్ పెట్టాలని తేదేపా నాయకులు కోరారు. పార్టీ నాయకులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.