యువతకు దేహ దారుఢ్యంతో పాటు మానసిక కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయని.. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. పలు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించిన నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు ప్రభాకర్ రెడ్డిని తన జనసేన కార్యాలయంలో సత్కరించారు. అంతకుముందు ప్రభాకర్‎తో కలిసి పవన్ యుద్ధ కళలు ప్రాక్టీస్ చేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..మన దేశంలోనూ పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయని, వాటితో పాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. చిన్నప్పటి నుంచి బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మరక్షణతో పాటు మనోస్థైర్యం ఇచ్చే మార్గంగాను ఇవి ఉపయోగపడతాయని అన్నారు. 'వింగ్ చున్' అనే మార్షల్ ఆర్ట్.. మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి సెర్చ్ చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసిందన్నారు.

మార్షల్ ఆర్ట్స్ వివిధ దేశాల్లో శిక్షణ పొంది రికార్డులు సాధించిన ప్రభాకర్ పెద్ద నగరాలకు వెళ్లకుండా తన గ్రామంలో ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషమన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని, ఈ క్రమంలోనే తమ ట్రస్ట్ ద్వారా ఆయనకు ఆర్థిక తోడ్పాటు అందించామని పవన్ తెలిపారు. ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్‌లో 29 ప్ర‌‌పంచ రికార్డులు సాధించాన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా మార్షల్ ఆర్ట్స్ ప‌ట్ల ప్ర‌వేశం ఉంద‌ని.. న‌న్ను పిలిచి స‌త్క‌రించి, ఆర్ధిక స‌హాయం అందించ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు.

సామ్రాట్

Next Story