డిప్యూటీ సీఎంగా పవన్.. జనసేనకు కేటాయించే శాఖలివే?
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది.
By అంజి Published on 13 Jun 2024 1:59 AM GMTడిప్యూటీ సీఎంగా పవన్.. జనసేనకు కేటాయించే శాఖలివే?
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. నేడు చంద్రబాబు తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు సమాచారం.
పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అలాగే నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలిసింది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు జూన్ 12 బుధవారం నాడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, రజనీకాంత్, కె.చిరంజీవి వంటి ప్రముఖులు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
మంగళవారం జరిగిన వేర్వేరు సమావేశాల్లో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నాయుడును తమ నేతగా ఎన్నుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 135 సీట్లు, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) 11 స్థానాల్లో విజయం సాధించింది.