ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విధి విధానాలకు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేల చొప్పున మాత్రమే చేస్తామని తెలిపింది. మిగతా రూ.2 వేలను స్కూల్ లేదా కాలేజీ అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని పేర్కొంది.
కాగా 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని తెలిపింది. అయితే ఇందులో రూ.13 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేసి.. మిగతా రూ.2 వేలను పాఠశాల మెయింటెన్స్ కింద జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకం కంటే.. తల్లికి వందనం పథకంలో 25 లక్షల మందికి అధిక లబ్ధి చేకూరుతుందని తెలిపింది. గత జగన్ ప్రభుత్వం కంటే రూ.2500 కోట్లు అదనం అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.