ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని ఎటువంటి సమాచారం ఇంకా లేదు

Odisha train accident. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో

By Medi Samrat  Published on  4 Jun 2023 12:45 PM IST
ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని ఎటువంటి సమాచారం ఇంకా లేదు

ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు.బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఘటనపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బృందాన్ని ఒడిశాకు పంపించారని తెలిపారు. కోరమాండల్‌ సహా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న ఏపీ వాసుల వివరాలు సేకరిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు ఆగే స్టేషన్ల నుంచి ప్రయాణికుల సమాచారాన్ని సేకరించామన్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని మంత్రి బొత్స తెలిపారు. వీరిలో విశాఖపట్నంలో దిగాల్సిన వారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు అయిదుగురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారన్నారు. వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లు చేసి వారిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 267 మంది సురక్షితంగా ఉన్నారని తెలిసిందన్నారు. 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయని.. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడైందన్నారు. 113 మంది ఫోన్లు ఎత్తడంలేదని.. వారి వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారని.. విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి ముగ్గురు ఉన్నారని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని.. ఇద్దరికి స్వలంగా గాయాలు అయ్యాయన్నారు. 10 మంది ట్రైన్ ఎక్కలేదన్నారు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడం లేదా స్విచాఫ్‌ అవ్వడంతో వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని నిర్ధారిత సమాచారం ఏం లేదని అన్నారు బొత్స. సహాయక చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.


Next Story