ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉందని ఇటీవల వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాట్లాడుతున్న మాటలు, వారు మొన్న గవర్నర్ ను కలవడం అత్యంత వివాదాస్పదమైంది. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను, పేరుకుపోయిన జీపీఎఫ్, మెడికల్ క్లయిమ్స్, డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి చెప్పుకొన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలని గవర్నర్ ను కోరారు.
ఇక ఈ పరిణామాల అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై తమను సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్ ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది. రోసా రూల్స్ ఉల్లంఘించినందుకు గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.