అవును.. రఘురామ కృష్ణరాజును అరెస్టు చేశాం: ఏపీ సీఐడీ
Note On MP Raghu Rama Krishnam Raju Arrest.
By Medi Samrat Published on 14 May 2021 2:54 PM GMTనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఏపీ సీఐడీ ధ్రువీకరించింది. రఘురామ కృష్ణ రాజును అరెస్టు చేశామని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటనను విడుదల చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు మోపినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని ఏపీ సీఐడీ తెలిపింది.
ఈరోజు సాయంత్రం రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారని.. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రఘురామకృష్ణరాజు ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు.
రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ మాట్లాడుతూ వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని.. అరెస్ట్ కు కారణాలు చూపలేదని, తాము అడిగితే కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారని భరత్ చెప్పారు. పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు, మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని భరత్ వాపోయారు. ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల కిందటేనని చెప్పారు. తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులా, రౌడీలా అనేది అర్థంకాలేదని.. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని అన్నారు.