గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
By - Medi Samrat |
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆథారిటీ (APSADA) కో-వైస్ ఛైర్మన్, నాన్-ఆఫీషియల్ కమిటీ సభ్యులు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా లో వచ్చిన వార్తలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య (గల్ఫ్) ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానిక్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. భారతదేశం నుండి జరిగే మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3,4 శాతం మాత్రమేనని, అది కూడా ప్రధానంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA), జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ సూయెజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
అమెరికా టారిఫ్‌లతో పోటీ సామర్థ్యంపై ప్రభావం లేదు
అమెరికా మార్కెట్‌లో డిమాండ్ 2026 మార్చి నెలాఖరుకు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా సీ ఫుడ్ ఎక్స్ఫో నార్త్ అమెరికా (మార్చి 15–17, 2026, బోస్టన్, అమెరికా) అనంతరం డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా మార్కెట్‌లో సాధారణంగా 50 మరియు 60 కౌంట్ రొయ్యలకు మంచి డిమాండ్ ఉంటుందని, ఇవి ఆంధ్రప్రదేశ్ రైతులు సాధారణంగా ఉత్పత్తి చేసే సైజులు కావున ఆ కౌంట్ వచ్చే వరకు మధ్యస్థ పట్టుబడులు చేయనవసరం లేదన్నారు. భారతీయ రొయ్యలపై అమెరికా విధించే సుమారు 20 శాతం టారిఫ్ (Basic Duty, Anti-Dumping Duty – ADD, Countervailing Duty – CVD సహా) ఇతర పోటీ దేశాలపై ఉన్న టారిఫ్‌లతో సమానంగా ఉండటం వల్ల అంతర్జాతీయ సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్‌లో భారతదేశ పోటీ సామర్థ్యం కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
షిప్పింగ్ కంటైనర్ల కొరతపై ప్రచారం అసత్యం
ప్రస్తుతం షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉందని ప్రచారం జరుగుతున్న వార్తలు అసత్యమని మంత్రి స్పష్టం చేశారు. కంటైనర్ల కొరత కారణంగా ఎగుమతులు ప్రభావితం అవుతున్న పరిస్థితి ప్రస్తుతం లేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంటైనర్లు ఇప్పటి వరకు వెనక్కి రాలేదని తెలిపారు. ఎగుమతుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, రైతులకు సమయానుకూల సూచనలు అందించేందుకు ప్రతి నెల చివరి వారంలో APSADA డైరెక్టర్లు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారతదేశం , యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కొనసాగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) చర్చలు పూర్తైతే భారత సముద్ర ఆహార ఎగుమతులకు మరింత మార్కెట్ అవకాశాలు లభించి భవిష్యత్తులో ఎగుమతులు పెరగడానికి దోహదపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దు
ఆక్వా రైతులు భయంతో లేదా ముందస్తు హార్వెస్టింగ్ చేయనవసరం లేదని, ఇలా చేయడం వల్ల మార్కెట్‌లో ఒకేసారి అధిక సరఫరా ఏర్పడి రొయ్యల ధరలు పడిపోవడం, రైతులకు ఆర్థిక నష్టం కలగడం జరిగే అవకాశం ఉందన్నారు. రైతులు ఎగుమతిదారులు మరియు మత్స్యశాఖ అధికారుల సలహాలతో తమ ప్రణాళిక ప్రకారం కల్చర్ సైకిల్ పూర్తయ్యాక మాత్రమే సరైన సమయంలో హార్వెస్టింగ్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు , ఇతర సంబంధిత భాగస్వాములతో సమన్వయం చేస్తూ రాష్ట్రం నుండి సముద్ర ఆహార ఎగుమతులు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని రొయ్యల రైతులు నిరాధారమైన వార్తలు , వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా, శాస్త్రీయ విధానంలో అక్వాకల్చర్ కార్యకలాపాలను కొనసాగించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.