బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'నివర్' తుపాను బుధవారం సాయంత్రం ఇది తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే ఇది తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయ దిశగా 430 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలుస్తోంది.
దీని ప్రభావంతో తమిళనాడులో వర్షాలు పడుతూ ఉన్నాయి. 'నివర్' కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ తుపాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరులో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రేపటి నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.