కన్ఫర్మ్.. ఏపీలో కూడా మొదలైన కరోనా ఆంక్షలు

Night Curfew in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఆంక్షలను అమలు చేయాలని

By Medi Samrat  Published on  10 Jan 2022 2:34 PM IST
కన్ఫర్మ్.. ఏపీలో కూడా మొదలైన కరోనా ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఆంక్షలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నేడు సమీక్ష జరిపారు. అందులో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపైనా.. కోవిడ్‌ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని వివరించిన అధికారులు.. కోవిడ్‌ సోకిన వారికి స్వల్పలక్షణాలు ఉంటున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉంచాల్సిన మందుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలని.. వైద్యనిపుణులతో సంప్రదించి రోగులకు ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని జగన్ సూచించారు. సీఎం అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 104 కాల్‌ సెంటర్‌ను మరింత బలోపేతం చేయాలని.. ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని సీఎం జగన్ సూచించారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని.. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని అధికారులకు తెలిపారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని.. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలని అన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని, మాస్క్‌తప్పనిసరి చేయాలని అన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమలు చేయాలని అన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని అన్నారు. దీనిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.


Next Story