ఏపీలో ఇంకొద్దిరోజులు నైట్ కర్ఫ్యూ..!

Night Curfew Extended In AP. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొద్ది రోజుల పాటూ నైట్ కర్ఫ్యూ అమలవ్వనుంది. మరో వారం పాటు

By Medi Samrat  Published on  20 July 2021 3:49 PM IST
ఏపీలో ఇంకొద్దిరోజులు నైట్ కర్ఫ్యూ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొద్ది రోజుల పాటూ నైట్ కర్ఫ్యూ అమలవ్వనుంది. మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాజాగా పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని.. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సమర్ధంగా నిర్వ‌హించ‌డం ద్వారా ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందింద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలియ‌జేశారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై మంగ‌ళ‌వారం ఆయ‌న అమ‌రావ‌తిలో స‌మీక్ష నిర్వ‌హించారు.

రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్‌ డోసులు వ‌చ్చాయ‌నీ, ఇంకా 8,65,500 డోసుల‌ను వినియోగించాల్సి ఉంద‌ని తెలిపారు. ఇప్పటివరకు 1,82,49,851 డోసులు ఇచ్చామ‌న్నారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా చేసినట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింద‌నీ, విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ తీసుకున్నార‌నీ వివ‌రించారు.

థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,628 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 291 కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,41,724 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 19,05,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. 23,570 మంది చికిత్స పొందుతున్నారు.


Next Story