ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తోందని కథనాలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందించారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని.. పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపును ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని.. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించడంలేదని అన్నారు.