త్వరలో యూఏఈ –ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది
By - Knakam Karthik |
త్వరలో యూఏఈ –ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది. అటు ప్రభుత్వ ప్రతినిధులు, ఇటు వాణిజ్య సంస్థ అధిపతులతో వరుస సమావేశాలతో యూఏఈ-ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధానికి తెరతీశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. పర్యటన చివరి రోజు శుక్రవారం దుబాయ్‌లో ముఖ్యమంత్రి పలువురు యూఏఈ మంత్రులను, అక్కడ వాణిజ్య సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ముందుగా యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. యూఏఈ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధాన్ని పెంపొందించే అంశంపైనా, లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల గురించి ఇరువురు నేతలు చర్చించారు.
భారత్-యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్టుగానే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై ఏపీకి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై ఇరువురు అవగాహనకు వచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యంగా ఆహార భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి ఆసక్తి కనబరిచారు.
యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో భేటీ
యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదితోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం అంశాలపై చర్చ జరిగింది. థానీ బిన్ అహ్మద్ భారతదేశం -యుఏఈల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో భాగస్వామ్యంతో పాటు... ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై థానీ ఆసక్తి చూపించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని థానీ అన్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శిస్తామని చెప్పారు.