గుడ్‌న్యూస్‌.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం

మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

By Medi Samrat
Published on : 23 Aug 2025 6:10 PM IST

గుడ్‌న్యూస్‌.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం

మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద, ఆరోగ్య బీమా స్కీంను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ-ఆక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీంను అమలు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ కార్మికుల శాలరీ ప్యాకేజ్ ఖాతాలు ప్రారంభించారు. ఈ కొత్త ఆర్థిక సదుపాయం ద్వారా మున్సిపల్ కార్మికులకు గణనీయమైన భరోసా లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 అర్బన్ లోకల్ బాడీస్‌లో మొత్తం 55,686 మంది కార్మికులు సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీం ద్వారా వీరందరికీ ఈ బీమా సదుపాయం లభించనుంది. వీరిలో 39,170 మంది పబ్లిక్ హెల్త్ విభాగంలో ఉండగా, 16,516 మంది ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారందరికీ ఈ పథకం వర్తించనుంది.

ఇప్పటి వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో కుటుంబీకులకు ఎక్స్-గ్రేషియా రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ప్రమాద మరణానికి రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చే విధానం అమలులో ఉంది. ఇప్పుడు ఆక్సిస్ బ్యాంక్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా ఈ ప్రయోజనాలు మరింత విస్తరించాయి. శాశ్వత ఉద్యోగులకు ఒక రూ. 1 కోటి వరకు ప్రమాద బీమా, పది లక్షల లైఫ్ కవర్ లభించనుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లైఫ్ కవర్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ప్రమాద మరణం జరిగితే పిల్లల చదువు కోసం గరిష్టంగా రూ. 8 లక్షల వరకు విద్యా సహాయం అందించనుంది.

దీంతో పాటు తక్కువ ప్రీమియం ద్వారా ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా రూ. 33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఇదే కాకుండా మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులు మరో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే వారికి రూ. 15 లక్షల మేర ప్రమాద బీమా కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మున్సిపల్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story