నూతన రైస్ కార్డుల విష‌యంలో గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు రేప‌టి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

By Medi Samrat
Published on : 6 May 2025 8:00 PM IST

నూతన రైస్ కార్డుల విష‌యంలో గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు రేప‌టి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరుగుచున్నదన్నారు. ఇందుకై దగ్గర్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించ బడిందని, వారం రోజుల తుదుపరి వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. జూన్ మాసంలో స్మార్టు కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయాల్సినదిగా భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. తదుపరి ఇకెవైసి తప్పని సరిగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇకెవైసి ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యం అయిందని, అయితే ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఇకెవైసి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించడం తో దాదాపు 6,45,765 మందికి ఇకెవైసి చేయడం జరగలేదన్నారు. అదే విధంగా ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో స్మార్టు రైస్ కార్డులను జారీ చేస్తామని, ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయని, ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని, డాటా బేస్ కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ లో ఆటో మేటిక్ గా డాటా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

గత ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 7 సెంటీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదు అయిందని, పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. దీపం-2 పథకం క్రింద నేటికి 1,50,19,303 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగిందని, సిలిండర్ డెలివరీ చేసిన కొన్ని గంటల్లోనే రాయితీ సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు.

జూన్ 12 నుండి రాష్ట్రంలోని 41 వేల ప్రభుత్వ పాఠశాలలకు మరియు 4 వేల సంక్షేమ వసతి గృహాలకు ఫైన్ క్వాలిటీ రైస్ను 25 కే.జీ.ల బ్యాగ్ల ద్వారా ప్రతి మాసం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

.

Next Story