ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలు
New MLCs Take Oath In AP. గవర్నర్ కోటా కింద మండలికి ఎన్నికైన నలుగురు వైసీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు
By Medi Samrat Published on 21 Jun 2021 10:00 AM GMT
గవర్నర్ కోటా కింద మండలికి నామినేట్ అయిన నలుగురు వైసీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీల చేత ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. గతవారం గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు వైసీపీ ఆవిర్భావం నుండి జగన్‌తో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్ ఉన్నత విద్యావంతుడు. ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.