నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.
By అంజి
నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: కోటంరెడ్డి
అమరావతి: తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. 'నన్ను చంపితే రూ.కోట్లు ఇస్తానని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలి. వైసీపీ నేతలు, రౌడీ షీటర్లు బుడ్డ బెదిరింపులను నేను కాదు కదా.. నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. ప్రతి మనిషికి ఏదో రోజు మరణం వస్తుంది. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు' అని తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఓ ఛానల్‌లో ప్రసారమైన వీడియో చూసి మొదట షాక్ కి గురయ్యానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీషీటర్లు ఈ ఏడాది జులై 1న ఈ సంభాషణ జరిపినట్లు తెలిసిందన్నారు. తనను చంపడానికి డిస్కషన్లు చేయడంపై కోటంరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయం మూడు రోజుల ముందే తన దృష్టిలోకి వచ్చిందని జిల్లా ఎస్పీ చెప్పారని.. కానీ, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోమని సూచించలేదని తెలిపారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు రౌడీషీటర్, విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ కృష్ణకాంత్ విచారణ జరుపుతున్నారు.