నెల్లూరులో పోలీసుల అక్రమ వసూళ్లు

Nellore Police. నెల్లూరు జిల్లాల్లో కొందరు పోలీసులు అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు

By Medi Samrat  Published on  16 Sep 2021 8:05 AM GMT
నెల్లూరులో పోలీసుల అక్రమ వసూళ్లు

నెల్లూరు జిల్లాల్లో కొందరు పోలీసులు అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనదారులు, వ్యాపారులు, ఆటోవాళ్లు, రిక్షావాళ్లు, కూలీల దగ్గర నుండి నడి రోడ్డుపై డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బాధితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో ట్రాఫిక్ సమస్య కారణంగా పగలు లారీలు, మరికొన్ని వాహనాలు రాకపోకలపై నిషేధం ఉంది. లారీలు, సరుకుల ఆటోలు నగరంలోకి వస్తున్నాయి. ట్రాఫిక్ తీవ్రంగా ఉండే రోడ్లలో అడ్డంగా నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు వాటిపై చర్యలు తీసుకోకుండా.. ఒక్కో వాహనం నుంచి వంద నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రోడ్లపై చిరు వ్యాపారులను కూడా వదలడంలేదని.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వాపోయారు. షాపుల ఎదుట వాహనాలు అడ్డంగా ఉన్నాయంటూ వ్యాపారులు, హోటళ్ల వంటి వారి వద్ద నెల మామూలు లాగుతున్నారట..! ఒక్కో ఆటోకు రోజుకు వంద, రిక్షాలకు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాలని కూడా కోరుతున్నారు.


Next Story
Share it