నరసాపురం ఎంపీడీవో అదృశ్యం ఘటన విషాదాంతం..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కథ విషాదాంతమైంది.
By Medi Samrat Published on 23 July 2024 10:26 AM GMTపశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కథ విషాదాంతమైంది. ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది. వారం రోజులుగా గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న ఆయన మృతదేహం కనిపించింది. వెంకట రమణారావు దూకిన ప్రదేశానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన వెంకట రమణారావు 15న పని ఉందని.. మచిలీపట్టణం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని మెసేజ్ పంపి సెల్ ఆఫ్ చేశారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మచిలీపట్టణం, విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఆయన మృతదేహం లభ్యమైంది.
ఎంపీడీఓ కుటుంబానికి న్యాయం చేస్తాం : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
నరసాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మృతదేహం లభ్యమైంది అనే సమాచారం నిర్థారణ అయింది. ఆయన మరణం దురదృష్టకరం. బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచ్చిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఇప్పటికే పి.ఆర్. అండ్ ఆర్.డి. అధికారులను ఆదేశించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందన్నారు.