కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

By Medi Samrat  Published on  26 Sep 2023 3:30 PM GMT
కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడి పంచాయితీలను అక్కడే చూసుకోవాలని అన్నారు. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలోని రెండు రాజకీయ పార్టీ మద్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు కేటీఆర్. ఈ విషయంపై బీఆర్ఎస్‌ నాయకులు స్పందిస్తే వారి వ్యక్తిగతం అని చెప్పారు. వారి వాఖ్యలతో పార్టీ అధిష్టానానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్‌ అయ్యింది ఆంధ్రప్రదేశ్‌లోనే అని అన్నారు. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. "చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు నినదిస్తున్నారని, ఈ క్రమంలోనే నిరసనలు చేపడుతున్నారు" అని అన్నారు లోకేష్. హైదరాబాదులో కూడా తెలుగువాళ్లు ఉన్నారని, వాళ్లు శాంతియుత ప్రదర్శనలు చేపడుతుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ మద్దతుదారులు ఎక్కడా హద్దులు దాటి ప్రవర్తించలేదని, హైదరాబాదులో శాంతియుతంగానే నిరసన చేపట్టారని లోకేశ్ చెప్పుకొచ్చారు.

Next Story