అమరావతి రాజధాని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు కోట్లాది మంది ఆంధ్రుల తరపున ప్రధానికి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. ఏళ్ల తరబడి అనిశ్చితి నెలకొన్నా, ఎన్నో కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా అమరావతి కలని సజీవంగా ఉంచిన రైతుల పోరాటం అసాధారణమని కొనియాడారు. రైతుల ఈ మహోన్నత త్యాగానికి గౌరవంగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని, ఈ ప్రక్రియలో ప్రధాని మార్గదర్శకత్వం, సహకారం ఎంతో అవసరమని లోకేష్ కోరారు. దీనికి సంబంధించి ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరాలను వెల్లడించారు.