శవరాజకీయాలపై పేటెంట్ ఉంది జగన్ రెడ్డికే : లోకేష్ తీవ్ర విమర్శలు
Nara Lokesh Fire On CM Jagan. ప్రజల సమస్యలకు సంబంధించి అత్యవసర సమస్యలు, ఇబ్బందులు తలెత్తినప్పుడు చర్చకోసం
By Medi Samrat Published on 14 March 2022 11:24 AM GMTప్రజల సమస్యలకు సంబంధించి అత్యవసర సమస్యలు, ఇబ్బందులు తలెత్తినప్పుడు చర్చకోసం సభలో వాయిదాతీర్మానం ప్రవేశపెడితే దాన్ని తిరస్కరిస్తారా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనలో 25మంది చనిపోతే దానికంటే ప్రభుత్వానికి అర్జెన్సీ అంశం ఏముంది?. ఘటనపై మండలిలో చర్చిద్దామంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? అంటూ ప్రశ్నించారు. 25మంది చనిపోయారు.. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.. భార్యాపిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారయ్యా అంటుంటే శవరాజకీయాలు అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శవరాజకీయాలపై పేటెంట్ ఉంది జగన్ రెడ్డికే అని విమర్శలు గుప్పించారు.
శవరాజకీయాల ట్రేడ్ మార్క్, వాటికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని.. తండ్రిశవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాలు సేకరించింది ఎవరని ప్రశ్నించారు. సొంత బాబాయ్ కి గొడ్డలి పోటు వేసి, దాన్నిబూచిగా చూపించి ప్రజల నుంచి ఓట్లు పొందింది జగన్ రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. మండలిలో మేం వాయిదాతీర్మానం ఇస్తే.. దానిపై వాళ్ల వెర్షన్ వాళ్లు చెప్పుకుంటూ.. చదువుతుంటే మేం వినాలంటా? అని ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెం ఘటనపై మేం చర్చ జరగాలి అంటున్నాం. ప్రభుత్వం చేసే ఉత్తుత్తి ప్రకటనలు కాదు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పట్టుపట్టినా నాటుసారా మరణాలపై చర్చించడానికి ప్రభుత్వానికి ఎందుకంత భయం? అని లోకేష్ అడిగారు. 4 గంటలు తమను పట్టుబట్టేలా చేయకపోతే.. నాటుసారా మరణాలపై చర్చించాక, బడ్జెట్ ప్రసంగంపై చర్చకుపోతే బాగుండేది కదా.. అని అన్నారు.