నారా లోకేష్ అరెస్టు

Nara Lokesh Arrest. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

By Medi Samrat  Published on  16 Aug 2021 8:36 AM GMT
నారా లోకేష్ అరెస్టు

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో ఆరోపణలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. నిందితుడిని శశికృష్ణ అనే యువకుడిగా భావిస్తున్నారు. నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని తెలిపారు. కేసు దర్యాప్తులో స్థానికులు కీలక సమాచారం ఇచ్చారని.. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని గౌతమ్ సవాంగ్ అన్నారు. గుంటూరు అర్బన్ పోలీసులు నిందితుడిని నరసారావుపేట మండలం పమిడిపాడు వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి దిశ చట్టం కింద కఠినశిక్ష పడాలని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.


Next Story
Share it