చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు అన్నచందంగా.. చంద్రబాబు కుప్పం చుట్టు గిరా గిరా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే రోజా వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం బయట ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. 14 ఏళ్ల సీఎం పదవిలో ఉన్న చంద్రబాబుకు.. ఎనాడైనా కుప్పం ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనిపించిందా అంటూ ప్రశ్నించారు. కనీసం మంచి నీటి సౌకర్యం కుడా కల్పించలేదన్నారు.
కుప్పంలో ఇళ్లు కట్టుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు వచ్చిందంటే.. దానికి కారణం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారనే అర్థం అవుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు వాస్తవాలను చూపించారని అన్నారు. చంద్రబాబుకు నెత్తిన ఉన్న కళ్లు నేలకు దిగాయని, ముందస్తు ఎలక్షన్స్ అంటున్న చంద్రబాబు వాస్తవాలను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఎన్నికలు కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాలన్నారు. అంత సరదా ఉంటే టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే రోజా తెలిపారు.