సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Responds On Jagan Comments. నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Nov 2022 11:02 AM
సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన నాదెండ్ల మనోహర్

నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! తాను కుప్పంలో కూడా గెలవలేనన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని.. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, అటు దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారని.. ఇలాంటి నాయకులు ఉండడం చూసి ప్రజలు కూడా ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని.. మంచి జరిగితే మాకు అండగా, తోడుగా నిలబడాలని సీఎం జగన్ ప్రజలను కోరారు.

జనసేన పార్టీని రౌడీసేన అని విమర్శించడంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జనసేన ఎందుకు రౌడీసేన? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తుచేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? జనసేన ఎందుకు రౌడీసేన? అని నాదెండ్ల నిలదీశారు. మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారూ!" అంటూ నాదెండ్ల ప్రశ్నించారు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను, వీర మహిళలను, జనసైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను బయటపెడుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు.


Next Story