తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన కోసం కొందరు సుపారీ కిల్లర్లను నియమించినట్లు సమాచారం ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని కోరారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం రాత్రి జరిగిన పార్టీ అంతర్గత సమీక్ష సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలంగా ఎదుగుతోందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతుందని పవన్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే దిశగా పార్టీ పనిచేస్తోందన్నారు. “ఈ తరుణంలో జనసేనను ఆపడానికి వైసీపీ ఏమైనా చేయొచ్చు. అధికారం పోతుందనే భయం నాయకులను క్రూరంగా మార్చగలదు. వాళ్లు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసైనికులు, వీరమహిళలపై కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడులను మరువలేనని ఆయన అన్నారు. ఈ విషయమై ప్రతీకారం తీర్చుకోలేదన్న పవన్.. బలమైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. గట్టి కౌంటర్ ఇచ్చే సమయం వస్తుందని అన్నారు. మీరు నన్ను ఎంత బెదిరిస్తే, నేను అంత బలవంతుడిని అవుతానని వైసీపీ నేతలనుద్దేశించి పవన్ అన్నారు.
గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని గోదావరి జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కోరారు. తాను సినీ నటుడిని కాకపోతే మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేవాడినని అన్నారు.