వైసీపీ లోకి పలువురు జనసేన నేతలు చేరారు. ముమ్మడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జీగా వ్యవహరించిన పితాని బాలకృష్ణతో పాటు డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున్ సహా పలువురు నేతలు వైసీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి వద్ద జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జీ ఉమామహేశ్వర నాయుడు, ఆయన మద్దతుదారులు వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేన పార్టీకి ఇటీవలే రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు. పొత్తులో భాగంగా 21 సీట్లు వస్తే ఒక్క శెట్టి బలిజకు కూడా సీటు ఇవ్వలేదని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. జనసేన తరుపున శాసనసభ సభ్యుడిగా పోటీచేసే అవకాశాన్ని పొందిన తొలి నేతగా పితాని బాలకృష్ణకు పేరు వచ్చింది. అయితే జనసేన పొత్తు పెట్టుకోవడంతో పితాని బాలకృష్ణకు అన్యాయం జరిగిందని అభిమానులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.