వైఎస్ జగన్ మెహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలోని కొందరు మిత్రుల ద్వారా తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఆ ప్రకటన తనది కాదని వివరణ ఇచ్చారు. తాను చేసే ప్రకటనలు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయని, గమనించగలరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఇటీవల వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని తెలిసి కూడా మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారన్నారు. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారని, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని వైఎస్ జగన్ ప్రశ్నించారు.