ఆ విష‌యంలో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ : విజయసాయి రెడ్డి

ఢిల్లీలో సీఈసీ రాజీవ్ కుమార్ తో భేటీ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

By Medi Samrat  Published on  28 Aug 2023 1:45 PM GMT
ఆ విష‌యంలో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ : విజయసాయి రెడ్డి

ఢిల్లీలో సీఈసీ రాజీవ్ కుమార్ తో భేటీ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలను ఎన్నికల సంఘానికి వివరించామని.. సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను, ఇతర రాష్ట్రాలను ఐఏఎస్ లను ఏపీలో పర్యటించాలని కోరామని అన్నారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేశామని.. నిబంధనలను ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని, కేవలం ఒక పార్టీకి చెందిన ఓట్లను తొలగించే ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాలేదని అన్నారు. ఓటర్ల తొలగింపుపై సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే చాలాసార్లు పోరాడామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో నాలుగైదు ఎన్నికలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. ఒక పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే పెద్ద సంఖ్యలో బోగస్ ఓటరు కార్డులు ముద్రించారని ఆరోపించారు. ఎక్కడిక్కడ ఇష్టానుసారం ఓట్లేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ రాజ్య‌సభ సభ్యులు విజయసాయి రెడ్డి. అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లను తయారు చేయడంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. వెన్నుపోటు పొడుస్తారు, ఎన్టీఆర్‌ ఫొటోకు దండ వేస్తారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015, 2016, 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయో, మా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఏ రకంగా తొలగించారో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరంగా తెలియజేశామన్నారు. దొంగ ఓట్లు నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుతో ఈ విషయంలో ఎవరైనా పోటీ పడగలరా..? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో విచారణ చేయమని కోరాం.. చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లు ఎన్నో చేర్చినా.. మాకు 49 శాతం ఓట్లతో ప్రజలు అధికారం అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయమనే నమ్మకం ఉందన్నారు విజయసాయి రెడ్డి. ఈసారి 51 శాతం మేరకు ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story