బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఈ విషయాన్ని సుజనా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జనార్ధనరావు మరణంపై బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
జనార్ధనరావు కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించారు. కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. 1955లో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజినీర్ చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్థనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఉత్తమమైన సేవలందించినందుకు జనార్ధనరావుకు పలు అవార్డులు దక్కాయి.