పుట్టినరోజు నాడే ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు

MP Raghuramakrishna Raju Arrest. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన

By Medi Samrat  Published on  14 May 2021 7:22 PM IST
పుట్టినరోజు నాడే ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రఘు రామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే వచ్చారు. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. మరో వైపు తన అరెస్టుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయని కూడా గతంలో రఘురామ వ్యాఖ్యలు చేశారు. అనుకున్నట్లుగానే నేడు రఘురామ కృష్ణ రాజును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కనీసం చెప్పకుండా అరెస్టు చేశారని రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారని.. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం పైనా, సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఊహించని విధంగా అరెస్టు చేయడం సంచలం అయింది.


Next Story