అమరావతి రైతుల విజయం తథ్యం అని తాను ముందే చెప్పానని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రైతుల విజయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓ కారణమేనని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ. ఇక సీఎం జగన్ ఎలాంటి మెలికలు పెట్టే సాహసం చేయలేడని.. ఇక నుంచి అయినా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితువు పలికారు. తాను కూడా అమరావతి కోసం ముడుపు కట్టానని.. ఇది ఖచ్చితంగా రైతుల విజయమేనని పునరుద్ఘాటించారు. సీఎం జగన్ ఇకపై పిచ్చి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నానని రఘురామ అన్నారు.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. ఇవాళ్టి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. చట్టం రద్దుపై సీఎం జగన్ ప్రకటన చేస్తారని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అత్యవసరంగా సమావేశమైంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.