కాళ్లకు గాయాలతో రఘురామ.. తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవా..
MP Raghurama Krishnam Raju Sensational Allegations. ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 15 May 2021 8:18 PM ISTఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. రఘురామ కృష్ణ రాజు కళ్ళకు అయిన గాయాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీ సీఐడీ అధికారులు ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. మరో వైపు రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచిన న్యాయస్థానం ఆయనను ఆసుపత్రికి తరలించాలని కోరింది. తాను ప్రభుత్వాసుపత్రికి వెళ్లనని రఘురామ విముఖత వ్యక్తం చేయడంతో, రమేశ్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి సూచించారు.
తనను పోలీసులు కొట్టడంతో గాయపడ్డానని రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టుకు అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ రఘురామరాజు కాళ్లకు గాయాలు కనిపిస్తున్నాయని ఆయన తరపున లాయర్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది హైకోర్టు. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది.