ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ మేరకు తీర్పును వెలువరించింది. అనంతబాబు పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయన బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి వేసిన పిటిషన్ ను విచారించడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది. ఛార్జ్ షీటును రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఉపసంహరించుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అనంతబాబు తమ పార్టీ వాడు కాబట్టే కాపాడుకున్నామని.. తమ ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో సుప్రీంకోర్టు డీఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని అన్నారు. తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, ఇంకేమైనా చేసిన కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని విమర్శలు గుప్పించారు.