షర్మిలకు సగం ఆస్తి ఇవ్వాలన్న రఘురామ
MP Raghurama Comments On YS Sharmila. రఘురామ కృష్ణ రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్
By Medi Samrat Published on 12 Aug 2021 1:45 PM GMTరఘురామ కృష్ణ రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని.. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు. జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని.. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే న్యాయమని అన్నారు. వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని.. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని అన్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని సూచించారు.
ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని అన్నారు. ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని రఘురామ స్పష్టం చేశారు. తమ ఎంపీలు హైకోర్టును కర్నూలుకు మార్చాలని కూడా మంత్రికి విన్నవించారని వివరించారు. వైసీపీ సర్కారు తిరుమల శ్రీవారిని కూడా వదలడంలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇకపై సాలీనా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ లో నిర్ణయించారని వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే స్వామివారి నగలను సైతం విక్రయిస్తారేమోనన్న సందేహాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇకనైనా మా దేవుడ్ని వదిలేయాలి. తిరుమల వెంకన్న ఆస్తుల జోలికి వెళ్లవద్దంటూ భక్తులందరం కలిసి సీఎంకు వినతి పత్రం పంపుదామని రఘురామ చెప్పుకొచ్చారు.