విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి.. తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ఆయన ఇలా స్పష్టం చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదని, ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో అని అన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని చెప్పుకొచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి తాజాగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కరెక్టా…రాంగ్ అనేది నాకు తెలుసు. నాకు పార్టీ పట్ల విధేయత ఉందో లేదో నాకు తెలుసు. నాకు పార్టీ టిక్కెట్ ఇస్తుందా లేదా, ఎంపీ అవుతానా లేదా అనే బాధ నాకు లేదు. నేను చేసిన అభివృద్ధి ఇంకెవరూ చేయలేదు. ఇక్కడ రెండు ఫ్లాట్ ఫామ్‌లు మాత్రమే ఉన్నాయి. పార్టీలు లేవు. వైసీపీకి జగన్, మాకు చంద్రబాబు నాయకులు. వాళ్ళిద్దరే విరోధులు.. ఇంకెవరూ విరోధులు కాదని కేశినేని నాని అన్నారు. మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి కనిపించిన కేశినేని నాని, తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.