బాలశౌరి దారి అక్కడికే?
MP Balashauri joined the Janasena party as expected
By Medi Samrat
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుకున్నట్లుగానే జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన చెప్పారు. ఆ ఐదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితిలేదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి విభేదాలు ఉండడంతో ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. మచిలీపట్నం ఎంపీగా తనకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించట్లేదని పలు సందర్భాల్లో ఆయన ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ మచిలీపట్నం సీటు కేటాయింపుపై కూడా స్పష్టత లేదని తెలిసింది. తనకు తెలియకుండానే మరొకరికి టిక్కెట్ కేటాయించారంటూ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.