వైఎస్ వివేకా హత్యకేసులో ఆదివారం సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారుల తీరుపై సీబీఐ పెద్దలకు తెలియజేశామన్నారు. పాత అధికారుల తప్పులనే కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వివేకా స్వయంగా రాసిన లేఖను సీబీఐ పట్టించుకోవడం లేదని అన్నారు. వివేకా హత్య గురించి నాకంటే ముందుగా తెలిసింది ఆయన అల్లుడికే అన్నారు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి.. వ్యక్తుల లక్ష్యంగా కాదని పేర్కొన్నారు. దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదని అన్నారు. దస్తగిరికి సీబీఐ అధికారులే బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకువెళుతున్నారని అన్నారు. ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్ గా మార్చుకున్నారని అన్నారు. అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపుతోందన్నారు. మేం లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించడంలేదని అన్నారు. పోలీసులకు నేనే స్వయంగా సమాచారం ఇచ్చానని స్పష్టం చేశారు. నాకంటే గంట ముందు తెలిసినా వివేకా అల్లుడు పోలీసులకు చెప్పలేదని అన్నారు. సమాచారం దాచిన వివేకా అల్లుడిని సీబీఐ విచారించలేదని.. వాచ్ మెన్ రంగన్న చెప్పింది కూడా అధికారులు పట్టించుకోవాలన్నారు.
మంచితనం నిలబెట్టుకుంటాం.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామన్నారు. విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందని ఆరోపించారు. సీబీఐ ఈ స్థాయికి దిగజారడం శోచనీయం అన్నారు. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా నేను సిద్దమేనని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.