వివేకా హత్య కేసు: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి అరెస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
By అంజి Published on 16 April 2023 3:45 AM GMTNext Story
వివేకా హత్య కేసు: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి అరెస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నట్లు ఆయన సతీమణికి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి కడప తరలిస్తున్నారు. భాస్కర్‌రెడ్డి అరెస్ట్ గురించి విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు.
సీబీఐ అధికారులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. వివేకా హత్యకేసులో ఆరుగురు ప్రధాన నిందితుల్లో భాస్కర్ రెడ్డి ఒకరు. సెక్షన్ 130 బీ, రెడ్ విత్ 302, 201 కింద భాస్కర్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న అవినాశ్ రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకున్నది.