వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. నాలుగున్నర గంటలపాటు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. విచారణ అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. సీబీఐ ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. సీబీఐ అధికారులు.. అవసరమైతే మరోసారి పిలుస్తామని అన్నట్లు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలను ఇప్పుడు బహిర్గతం చేయలేనని అవినాష్ రెడ్డి అన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.
విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని.. లాయర్‌ను అనుమతించాలని కోరాం. విచారణ అధికారి మా విజ్ఞప్తిని తోసిపుచ్చారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వాస్తవాలను ఒక వర్గం మీడియా వక్రీకరిస్తుందని.. విచారణను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను వైఎస్ అవినాశ్ కలిశారు. లోటస్ పాండ్ కు వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు.