50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు: మంత్రి పేర్ని నాని
Movie theaters to operate with 50% capacity.. AP Minister. కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నప్పటికీ సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేయడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్
By అంజి Published on 11 Jan 2022 11:16 AM ISTకోవిడ్ 19 కేసులు పెరుగుతున్నప్పటికీ సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేయడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. "కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా, 50 శాతం ఆక్యుపెన్సీ, ప్రత్యామ్నాయ సీటింగ్‌లతో సినిమా థియేటర్లను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమాల విడుదలను వాయిదా వేయాలని మేము చిత్రనిర్మాతలను కోరుతున్నాము" అని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు.
సినిమా టిక్కెట్ల సమస్యపై చర్చించేందుకు విజయవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కలిసిన అనంతరం నాని ఈ ప్రకటన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా టిక్కెట్ల అంశంపై చర్చించేందుకు ఆర్జీవీ తనను పిలిచారని మంత్రి తెలిపారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారమే సినిమా టిక్కెట్ల రేట్లు నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సినిమా టిక్కెట్ల సమస్యపై చర్చించేందుకు కమిటీని వేశామని, ఎలాంటి సూచనలు చేసినా స్వాగతిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల రేట్లు తగ్గించడంతో సినీ పరిశ్రమ నష్టపోయిందన్నారు. చిత్ర పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం ఉన్న నేను మంత్రితో ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించాను. సినిమా టిక్కెట్లకు సంబంధించినది ప్రధాన అంశం. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించే ఆలోచనను నేను వ్యతిరేకించాను, అని ఆర్జీవీ అన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ సభ్యులతో చర్చిస్తామని మంత్రి కొన్ని సలహాలు కూడా ఇచ్చారని వర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో థియేటర్ల మూసివేతపై చర్చ జరగలేదన్నారు. కేవలం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి నటులను టార్గెట్ చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని నేను అనుకోను.ప్రభుత్వ నిర్ణయం ప్రతి సినిమా దర్శకుడు, నటుడిపైనా ప్రభావం చూపుతుందని ఆర్జీవీ అన్నారు. తాను సినిమా డైరెక్టర్‌గా మాట్లాడేందుకు వచ్చానని కానీ సినీ పరిశ్రమ ప్రతినిధిని కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు.