రోశయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం
Mourning of many political dignitaries over the death of Roshaiya. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
By Medi Samrat Published on 4 Dec 2021 4:09 AM GMTతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశ్యయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య రాజకీయాల్లో తనదైన శైలిలో సహనశీలిగా, సౌమ్యుడిగా ప్రదర్శించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోశయ్య కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
చంద్రబాబునాయుడు..
కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రేవంత్ రెడ్డి..
జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన మారుపేరు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు కూడా రోశయ్య సొంతం. ఎమ్మెల్సీగా తొలి సారి చట్టసభలోకి నేను వచ్చినప్పుడు రోశయ్యతో దగ్గర పరిచయం ఏర్పడింది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో ఆయన నాకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. ఆయనలో నాపై ప్రత్యేక అభిమానం కనిపించేది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో అనేక విలువైన సూచనలు చేశారు. అలాంటి మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, సమాజానికి కూడా తీరని లోటు. వ్యక్తిగతంగా కూడా ఆయన లేనిలోటు తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..
మాజీ సిఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
నారా లోకేష్..
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సమున్నత వ్యక్తిత్వం, విషయపరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నారా లోకేష్.
శైలజానాథ్..
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రోశయ్య ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అజాత శత్రువుగా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ కొనియాడారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.