తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By - అంజి |
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నం కి 280 కి.మీ, కాకినాడకి 360 కి.మీ, విశాఖపట్నంకి 410 కి.మీ దూరంలో, దూరంలో కేంద్రీకృతమై ఉందంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదిలి ఈరోజు ఉదయానికి తీవ్రతుపానుగా బలపడి, రాత్రికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలంది. అటు విశాఖ జిల్లా వ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కాపులుప్పాడలో 125మిమీ, విశాఖ రూరల్ 120మిమీ, ఆనందపురంలో 117మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. 86 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
'మొంథా' తుఫానును ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి కేంద్ర సహాయం అందించారని, మంగళవారం ఉదయం ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం తెలిపారు. తుఫాను తీవ్రత, తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి విచారించడానికి ప్రధాని మోడీ ఉదయం తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చెప్పారు.
'మొంథా' తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 23 జిల్లాలకు సోమవారం (అక్టోబర్ 27) ఐఎండి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు కాకినాడ. అనంతపురం, కర్నూలు మరియు శ్రీ సత్యసాయి అనే మూడు జిల్లాలు మినహా, మిగిలిన జిల్లాలకు సోమవారం (అక్టోబర్ 27) 'భారీ నుండి అతి భారీ వర్షాలు' కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.