మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
By - Knakam Karthik |
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి రానున్న ప్రధాని.. వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
మరోవైపు నవంబర్ 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం పుట్టపర్తి రానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు, సీఎస్ విజయానంద్, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.