ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకొద్ది రోజులే సమయం ఉంది. అన్ని ప్రాంతాలలోనూ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరిచారు. ఇక కౌంటింగ్ సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏమి జరుగుతుందా అనే టెన్షన్ కూడా ప్రజలను వెంటాడుతూ ఉంది. అందుకే పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ను నిర్వహిస్తూ ఉన్నారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ సమీపంలోని రోడ్డుపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరైనా అల్లర్లు సృష్టించినా, హింసను ప్రేరేపించినా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.సృజన, ఎస్పీ జి. కృష్ణకాంత్‌లు డ్రిల్‌లో వివరించారు. మాక్ డ్రిల్ లో భాగంగా అల్లర్లను చెదరగొట్టడం, విధ్వంసక చర్యలను అణచివేయడం, గాయపడిన వారికి చికిత్స అందించడం, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా చూడడం వంటి దృశ్యాలను ప్రదర్శించారు. ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. పోలీసులు బాష్పవాయువు, తుపాకీ కాల్పులు, వజ్ర వాహనాల మోహరింపు, లాఠీ ఛార్జీలు వంటి పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో కూడా మాక్ డ్రిల్ సమయంలో చూపించారు.