ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. లేటెస్ట్‌గా ఆయన మీడియా ప్రతినిధులపై మాట్లాడిన కామెంట్స్‌కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. గుంతకల్లు సిటీ శివారులోని ధోనీ మొక్కల లేఔట్‌లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం లేఅవుట్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యల గురించి ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. గతంలో కబ్జాకు గురైన ఇళ్ల పట్టాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదే క్రమంలో తనపై కొందరు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ వార్తలు రాస్తున్నారని, ఆ వార్తలు రాసే ముందు నిరూపించే ధైర్యం ఉన్న వాళ్లే అలాంటి వార్తలు రాయాలన్నారు. అడ్డగోలుగా వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం హెచ్చరిక ఇచ్చారు. తనకు మీడియా అంటే ఏ మాత్రం లెక్క లేదని హాట్ కామెంట్స్ చేశారుఏ. తాను అన్నీ పనులు చేసిన వచ్చిన వాడినని, రాసుకోండి.. ఏం రాసుకుంటారో అంటూ తేల్చి చెప్పారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా మాత్రం రాస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళ తప్పులు ఉంటే వాటన్నింటినీ నిరూపించాలని స్థానిక మీడియా ప్రతినిధులకు సవాల్ చేశారు.