హీరో నానిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Comments On Nani. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో న్యాచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు

By Medi Samrat  Published on  29 Dec 2021 5:43 PM IST
హీరో నానిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా

ఏపీలో సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో న్యాచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కన్నా కిరాణా కొట్లకే ఎక్కువ ఆదాయం వస్తోందని అన్నారు. నాని వ్యాఖ్యలపై నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వ్యాపారం బాగున్నప్పుడు.. ఆయన సినిమాలు మానేసి కిరాణా దుకాణమే పెట్టుకోవచ్చు కదా అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుందని, దీంతో సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశముందని ఆమె అన్నారు. అందుకే అందరూ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారని రోజా తెలిపారు. అందరూ పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌ లాంటి స్నేహపూర్వకమైన సీఎంను మనం ఎక్కడా చూసి ఉండమ‌ని ఆమె వ్యాఖ్యానించారు. గ‌తంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతర సినీ పెద్దలు ఆన్‌లైన్‌ టికెట్ విధానం తీసుకురావాల‌ని చాలాసార్లు కోరార‌ని ఆమె అన్నారు. వారి విజ్ఞ‌ప్తి మేర సీఎం జగన్‌ అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు. టాలీవుడ్ పెద్ద‌ల‌తో చర్చలు జరిపిన అనంత‌రమే నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని అన్నారు. ఈ విష‌యంపై కొంద‌రు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. ఈ విష‌యాన్ని గ్రహిస్తోన్న‌ సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారని ఆమె తెలిపారు.


Next Story