మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకం

MLA Perni Nani Distribute YSR Cheyutha Checks In Machilipatnam. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని

By Medi Samrat
Published on : 25 Sept 2022 8:00 PM IST

మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకం

ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని వక్కాణించారు. ఆదివారం ఉదయం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన వైయస్ఆర్ చేయూత వారోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత పధకం క్రింద మచిలీపట్నం నగరపాలక పరిధిలో అర్హులైన 6,900 మంది అక్కచెల్లెమ్మలకు 12 కోట్ల 94 లక్షల రూపాయల విలువైన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని వేలాదిమంది మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మ‌.. మ‌న పుట్టుక‌కు చిరునామా అని.. మ‌న బ‌తుకుకు వీలునామా అన్నారు. అమ్మ గొప్ప‌త‌నం, ఆమె త్యాగం అజ‌రామ‌రం. ఆమె సహ‌నం అనంతం అన్నారు. అమ్మ ఉంటే మ‌న‌కో భ‌ద్ర‌త‌, భ‌రోసా. అమ్మ ఒడిక‌న్న ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశం బ‌హుశా ఎక్క‌డా ఉండ‌దేమోని మాతృమూర్తి త్యాగాన్ని కొనియాడారు. తమ భర్తలు చనిపోతే, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలకోర్చి వారిని చదివించి ప్రయోజకులను ఎందరో చేశారన్నారు. మహిళలకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, బిడ్డల అభ్యున్నతి కోసం వారి త్యాగనిరతి, కష్టపడే తత్వం ఆసామాన్యమన్నారు పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయ‌స్ఆర్ చేయూత కింద సాయాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఉపయోగించుకొని తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో 20,695 మంది లబ్ధిదారులకు రూ.38.8 కోట్ల రూపాయల పంపిణీ చేయబడిందని తెలిపారు.


Next Story