అలాంటి చెత్తను టీడీపీలో చేర్చుకుంటే సెంట్ అవుతుందా.?
వైసీపీని వీడుతున్న పలువురు నాయకులు టీడీపీలోనూ.. జనసేనలోనూ చేరుతున్నారు. వారిలో చాలా మంది టికెట్లను ఆశిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 18 Feb 2024 1:31 PM GMTవైసీపీని వీడుతున్న పలువురు నాయకులు టీడీపీలోనూ.. జనసేనలోనూ చేరుతున్నారు. వారిలో చాలా మంది టికెట్లను ఆశిస్తూ ఉన్నారు. వైసీపీని వీడిన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిని పార్టీలోకి తీసుకున్న ఘనత చంద్రబాబుదని.. పార్టీలోని నాయకులను పక్క నియోజకవర్గానికి పంపితే చెత్త అంటున్నాడని.. మరి అలాంటి చెత్తను టీడీపీలో చేర్చుకుంటే సెంటా అని ప్రశ్నించారు. అలాంటి చెత్తను మీరు మీ పార్టీలో చేర్చుకుని ఎంత మందిని పునీతులు చేస్తారో చెప్పాలని అన్నారు. తాను, చంద్రబాబు 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఓ బ్లాక్ కి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఏదో కాలం కలిసొచ్చి కిందా మీదా పడి స్థాయి పెరిగినంత మాత్రాన తనపై చౌకబారు విమర్శలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం తనకు తెలుసని, తనపై అవాకులు, చెవాకులు పేలితే గట్టిగా సమాధానం ఇస్తానన్నారు.
చంద్రబాబు నన్ను దుర్మార్గుడంటూ దూషించారు.. చీరాలలో ఆయనేదో నన్ను గెలిపించినట్లు.. దుర్మార్గుడని అన్నారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని నేను ఈ లోకంలో చూడలేదన్నారు కరణం బలరాం. ఇటువంటి తుచ్చమైన నీచమైన బుద్దులు నీకున్నాయి. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏంటో చర్చిద్దాం దమ్ముంటే రా అంటూ చంద్రబాబుకు కర్ణ బలరాం సవాల్ విసిరారు. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి కొంతమేరకు మాత్రమే మాట్లాడుతున్నాను. లోతుగా పోదల్చుకోలేదన్నారు. పోతే చాలా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే బలరాం.