ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవం తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర. ప్రస్తుతం జాతర మహాఘట్టం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ సందర్భంగా సారలమ్మను ఆదివాసీ పూజారులు గద్దెలపై ప్రష్టించారు. అదే సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై ప్రతిష్టించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. లక్షలాది మంది భక్తజనం జాతరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సమ్మక్క-సారక్క జాతరకు తప్పనిసరిగా వెళ్లే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డిలతో కలిసి హాజరయ్యారు.
భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బెల్లం సమర్పించారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే జాతర మరో రోజులో ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో మేడారంకు తరలివస్తున్నారు. పోలీసు, అధికార యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.